- చందమామ, గ్రహాల కదలికలు, నక్షత్రాల వీక్షణం
- సైన్స్ డేను పురస్కరించుకుని వరంగల్‌లో స్పెషల్ ఈవెంట్
- 10 రోజుల పాటు భద్రకాళి బండ్‌పై ‘స్టార్ గేజింగ్’
- స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్న రాకెట్ లాంచింగ్
- కుడా, వరంగల్ నిట్ ఆధ్వర్యంలో నిర్వహణ
హనుమకొండ, వెలుగు: చంద్రుడిని దగ్గరగా చూడటమే కాదు.. చందమామపై ఉండే మచ్చల్ని సైతం క్లారిటీగా వీక్షించవచ్చు.. ఆకాశంలోని నక్షత్రాలను వరుసగా లెక్కపెట్టవచ్చు.. గ్రహాల కదలికలూ కనిపెట్టవచ్చు.. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..? కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా), వరంగల్ నిట్ ఆధ్వర్యంలో ఇస్రో స్పేస్ ట్యూటర్, అన్సీంట్ టెక్నాలజీస్ డిజైన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్(ఏటీడీఆర్ఎల్) ఫౌండర్ శశాంక్ భూపతి టీం అలాంటి అవకాశం కల్పిస్తోంది.
నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని వరంగల్ లోని భద్రకాళి బండ్ పై ప్రత్యేక టెలిస్కోపులతో ఖగోళాన్ని కళ్లముందు పెట్టేందుకు స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నాయి. దాదాపు పదిరోజుల పాటు స్టార్ గేజింగ్(నక్షత్ర దర్శనం) నిర్వహించి, ఈ నెల 28 సైన్స్ డే రోజున రుద్రమ వీ1 అనే మోడల్ రాకెట్ ను ప్రయోగించబోతున్నారు.
భద్రకాళి బండ్‌పై టెలిస్కోప్‌లు..
వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కు భద్రకాళి బండ్ వేదికైంది. ఇక్కడ స్టార్ గేజింగ్ కోసం నాలుగు టెలిస్కోపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆకాశంలో గ్రహాలు, వాటి కదలికలను గమనించడంతో పాటు నక్షత్రాలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ నెల 28న నేషనల్ సైన్స్ డే రోజున అంతరిక్షంలో ఓ అరుదైన ఘట్టం ప్లానెట్ అలైన్మెంట్ జరగబోతోంది.
బుధుడు, గురుడు, శుక్రుడు, శని, యురేనస్, నెఫ్ట్యూన్.. ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించబోతున్నాయి. ఈ మహాత్తర ఘటాన్ని కూడా భద్రకాళి బండ్ పై ఏర్పాటు చేస్తున్న టెలీస్కోప్ ల ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటీడీఆర్ఎల్ ఆధ్వర్యంలో తయారు చేసిన నమూనా రాకెట్లు, శాటిలైట్స్ కూడా జనాలు సందర్శించేందుకు పెడుతున్నారు. కాగా ఈ నెల 28 వరకు ప్రతీరోజు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు స్టార్ గేజింగ్ సందర్శకులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
28న నింగిలోకి రుద్రమ వీ1 రాకెట్..
స్టార్ గేజింగ్తో పాటు మరో స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఏటీడీఆర్ఎల్ ఫౌండర్, తన టీమ్ తో కలిసి రూపొందించిన ‘రుద్రమ వీ1’ మోడల్ రాకెట్ ను ఈ నెల 28న సైన్స్ డే రోజు ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల పాటు సాగే ఈ స్పెషల్ ఈవెంట్ లో ఇదే హైలైట్ గా నిలవనుంది. దాదాపు 3 వేల అడుగుల వరకు రాకెట్ ను ఎగురవేసి, దాని ద్వారా వరంగల్ నగరానికి డేటా క్యాప్చర్ చేయనున్నారు. అనంతరం ప్యారాచ్యూట్ ద్వారా రాకెట్ భూమి మీదకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు, ప్రజలకు అవగాహన కోసమే రాకెట్ లాంచింగ్ చేస్తున్నట్లు ఏటీడీఆర్ఎల్ ప్రతినిధులు చెబుతున్నారు.
వరంగల్‌ను స్పేస్ హబ్‌గా మారుస్తం
స్పేస్ సైన్స్ గురించి విద్యార్థులకు నేర్పించాలనుకుంటున్నాం. రాకెట్ అంటే ఏంటి..? దాని వెనుక ఉన్న ఫిజిక్స్.. అదెలా పని చేస్తుందనే వివరాలు పిల్లలకు వివరించాలని ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్ ను స్పేస్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మొదటి ప్రయత్నంగా జనాలకు అవగాహన కల్పించేలా టెలిస్కోప్ లు ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నం. ఆ తరువాత ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిస్తాం.
-శశాంక్ భూపతి, ఏటీడీఆర్ఎల్ ఫౌండర్, ఇస్రో స్పేస్ ట్యూటర్-
